తిరుమల కొండపై ఓ ఛార్టెడ్‌ విమానం హల్‌చల్‌ చేసింది. కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా విమానం రెండు రోజులుగా తిరుమల కొండపై చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. అయితే ఈ విమానం కేంద్రానికి చెందినదని తెలియడంతో అధికారులు సైతం కలవరపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భద్రతా సిబ్బంది సైతం అయోమయానికి గురయ్యారు.

Advertisement

ఎస్‌వోఐకి చెందిన విమానం ప్రతి ఐదేళ్లకొకసారి దేశ భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సర్వే చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన తిరులమ విజిలెన్స్‌ అధికారులు వెంటనే చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. తిరుమల కొండపైకి విమానాలను పంపబోమని ఏటీసీ అధికారులు తెలిపారని విజిలెన్స్‌ వీజీవో మనోహర్‌ తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి వెంకటేశ్వర విమానానికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే ఓ నియమం ఉంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు.

ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల కొండపై విమానాలు తిరగరాదని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల కొండపై విమానాల తిప్పకూడదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాంతంలో దేవతలు విహరిస్తుంటారని తిరుమల భక్తుల నమ్మకం. కొండ ప్రాంతంలో పాజిటివ్‌ రేస్ ఉండడంతో.. గతంలో బ్రిటీష్‌కు చెందిన విమానాలు పేలిపోయానని అధికారులు చెబుతున్నారు. కాగా కొండపై నుంచి విమానం వెళ్లడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాణాల ప్రకారం శ్రీవారి ఆలయ గగనతలంపై లోహపు వస్తువుల ఎగరకూడదని పండితులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.