లాలుతండా పంచాయతీ సీపీఐకి కంచుకోటగా ఉంది. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థి గెలుపొందారు. ఇది ఓర్వలేని కొందరు సీపీఐ నాయకులు లాలుతండాకు చెందిన నూనావత్ తులసీరాం, భూక్యా ఉమాదేవి, బానోత్ లీలా కుటుంబాలను గ్రామం నుంచి వెలిసేందుకు వారి ఇంటి ఎదుట కంచెలు వేశారు. మీరు టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేశారు. మీరు మా గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ భయాందోళనకు గురి చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై సైతం దాడికి దిగి గాయపర్చారు. తులసీరాం భార్యపై దాడి చేశారు.

రెండ్రోజులుగా గ్రామంలో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీకి దివ్యాంగురాలైన బానోత్ నీల మద్దతు తెలిపావంటూ వేధింపులకు గురి చేశారు. వేధింపులు తాళలేక నీల శుక్రవారం ఉదయం లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, తండాకు వెళ్లగా, సదరు సీపీఐ నాయకులు మళ్లీ వేధించారు. తాళలేక సదరు మహిళ నీల చేతి గాజులను పగులగొట్టి వాటిని మింగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై పోలీసులు నీలను సంఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. తులసీరాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.