ఏపీలో వైసీపీ విజయంతో తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. తెలంగాణకు చెందిన కొందరు అఖిల భారత సర్వీసు అధికారులు ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీ, హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే ఏపీకి వెళ్లడం దాదాపు ఖరారుకాగా.. మరికొందరు ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలోని పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల చూపు ఇప్పుడు ఏపీపై పడింది. వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడుతున్న క్రమంలో పలువురు అధికారులు ఇంటర్‌స్టేట్‌ డిప్యుటేషన్‌పై వెళ్లే యోచనలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన అధికారులు ఇప్పుడు.. జగన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి ఏపీలో పనిచేశారు. ఈ అంశంపై జగన్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించే అవకాశముంది.

ఇదిలా ఉంటే హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర సైతం ఏపీకి డిప్యూటేషన్ పై వెళ్లడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టేందుకు స్టీఫెన్ రవీంద్ర సుముఖంగా ఉన్నారు. ఇదే విషయమై ఇప్పటికే కాబోయే సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అలాగే మరింకొంత మంది ఆఫీసర్లు సైతం ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.