హైదరాబాద్ లో నోరోవైరస్ కేసులు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. ఐదేండ్లలోపు ఐదుగురు చిన్నారుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. గాంధీ ఆసుపత్రి, ఎల్లా ఫౌండేషన్ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ లో ఐదేండ్లలోపు చిన్నారుల్లో నోరో వైరస్ కేసులను గుర్తించేందుకు మైక్రోబయాలజిస్ట్ లు 458 మంది చిన్నారుల మల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఈ నేపథ్యంలో ఐదు నోరో వైరస్ కేసులు వెలుగు చూసినట్టు వారు తెలిపారు.
నోరో వైరస్‌ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు.

కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడతారు. ఈ అంటువ్యాధి వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన ఉపరితలాలను తాకిన వారికి ఇది సులభంగా వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్ సోకిన వారిలో చాలామంది రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటారు.

నోరో వైరస్ లక్షణాలు:

నోరో వైరస్ ప్రధాన లక్షణాల్లో అనారోగ్యంగా లేదా వికారంగా అనిపించడం, అతిసారం (డయేరియా), వాంతులు. వంటివి కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటివి ఇతర సాధారణ లక్షణాలు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదం. వైరస్ సంక్రమణ, వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాళఙ. లక్షణాలు ఆగిపోయిన 48 గంటల వరకు బాధితులు ఇంట్లోనే ఉండాలి. చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. ఆల్కహాల్ బేస్డ్ జెల్స్ నోరోవైరస్‌ను నిర్వీర్యం చేయలేవు. ఎవరిలోనైనా వైరస్ బయపడితే వెంటనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి.