ఇకనుంచి వారానికి 2 రోజులు తెలంగాణలో పార్టీని పటిష్ఠం చేయడానికి అందుబాటులో ఉంటానని రాష్ట్ర నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ముఖ్య నేతలతో శుక్రవారం తన నివాసంలో ఆయన సమావేశమై చర్చించారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలపై నేతలు కూడా వారి అభిప్రాయాలను తెలిపారు. ఎన్నికల కారణంగా తెలంగాణలో తెదేపా సభ్యత్వ నమోదు ఇంతకాలం వాయిదా వేశామని, ఇక ప్రారంభిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఆయనకు వివరించారు. సభ్యత్వ నమోదు రాష్ట్రమంతా చేపట్టడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. వారానికి రెండు రోజులు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నేతలతో చర్చించారు. నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో తెదేపా శ్రేణులన్నీ గట్టిగా పనిచేసి మద్దతివ్వడం వల్లనే కాంగ్రెస్ నెగ్గిందని నేతలు వివరించారు. కాంగ్రెస్, తెదేపాలు పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండానే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గామని, దీన్నిబట్టి తెరాసపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అర్థమవుతున్నట్లు వారు వివరించారు. రాష్ట్రంలో తెదేపాను క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠానికి కృషిచేయాలని, తాను అందుబాటులో ఉంటానని చంద్రబాబు వారికి సూచించారు. రెండు రాష్ట్రాల పార్టీ కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహించాలని తెలంగాణ నేతలు ఆయనకు సూచించగా పూర్తిగా ఇక్కడే ఉండటం ఎలా అని ఆయన అన్నారు.