తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ప్రభుత్వం చిన్న తీపికబురు అందించింది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. టికెట్ రేట్లను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి.
ఆర్టీసీలో సాధారణంగా రూ.10 చార్జీ ఉండే చోట రూ.20 నుంచి రూ.30 వరకు కూడా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, సదరు బస్ కండక్టర్లతో గొడవలు కూడా పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు.
కొన్నిచోట్ల టికెట్ రేట్ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గురువారం నుంచి షెడ్యూల్ ప్రకారం బస్సులు:
గురువారం నుంచి అన్ని డిపోల్లో షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవనున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు, ఆర్డీవోలతో మంత్రి అజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ బస్సులో టికెట్ ధరల పట్టిక పెడతామన్నారు. టికెట్ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయమని తెలిపారు. ప్రతి బస్సులో పాస్లు కచ్చితంగా అనుమతించాల్సిందేనని ఆదేశించారు. అన్ని డిపోల్లో డీఎస్పీ ఇన్చార్జ్గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.