హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు. తాజాగా ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నిందితుడు ప్రవీణ్‌ 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే అక్కడికి వచ్చే మహిళల ఫోన్‌ నంబర్లను నిందితుడు తీసుకునేవాడని తేలింది. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యతం పెంచుకున్నాడు. పలువురు మహిళలలో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్‌ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, వాట్సాప్‌లో న్యూడ్‌ చాటింగ్‌లు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్‌ అయిందని పోలీసులు తేల్చారు.

మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు:

ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని నెల 2న రూ.5 లక్షలు ఇచ్చిన రేణు, ఆమె భర్త మరోసారి 6న తేదీన ప్రవీణ్‌ను కలిసి ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్‌పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రఘునాథ్‌ నేతృత్వంలోని బృందం ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్‌ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.

ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు అందులో టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష పేపర్‌ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్‌ కంప్యూటర్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత అతను, రాజశేఖర్‌ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్‌ చేశారు? ఏమేం పేపర్లు డౌన్‌లోడ్‌ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు.