9ఏళ్లుగా ప్రేమించుకున్నారు ఇద్దరి సామాజికవర్గాలు వేరు కావడంతో ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్ద‌ల‌ను కాద‌ని ఆరు నెల‌ల క్రితం ఆర్య‌స‌మాజ్‌లో ఒక్కటయ్యారు ఆ ప్రేమజంట. ప్రేమ పెళ్లిని అంగీకరించని యువతి బంధువులు భ‌ర్త ఇంట్లో నుంచి అమ్మాయిని బ‌లవంతంగా బైక్‌పై తీసుకెళ్లిపోయారు. ఇద్దరికి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నప్పటికి తన భార్యను కిడ్నాప్ చేశారంటూ బాధితుడు పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు. నిజామాబాద్ జిల్లాలో ఈసంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండల కేంద్రానికి చెందిన మాసం వంశీకృష్ణ అదే గ్రామానికి చెందిన యువతి శ్రీజ ఇద్ద‌రు ప్రేమించుకున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇద్దరూ మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు ఇష్టపడుతూ వచ్చారు. వంశీకృష్ణ, శ్రీజ సామాజికవర్గాలు వేరు కావడంతో అమ్మాయి తరపున పెద్ద‌లు వాళ్ల ప్రేమ‌ను అంగీక‌రించాలేదు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఐదు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో కులాంతర వివాహం చేసుకున్నారు. అటుపై పోలీసులను ఆశ్రయించారు.

ప్రేమజంట పోలీసుల్ని ఆశ్రయించడంతో ఇరుకుటుంబాల సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అబ్బాయితో అమ్మాయిని అత్తావారింటికి పంపించారు. రెండు నెలల గడిచిన తర్వాత శ్రీజ బంధువులు వంశీ కృష్ణ ఇంటికి వెళ్లి యువతిని కిడ్నాప్ చేయడానికి రెక్కీ నిర్వహించారు. అబ్బాయిని యువతి తరపు బంధువులు చంపడానికి కూడా ఇచ్చారంటూ బాధితుడు వంశీకృష్ణ పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఈసందర్భంలోనే యువతి తరపు బంధువులు ఆదివారం మధ్యాహ్నం భర్త ఇంట్లో లేని సమయం చూసి వంశీ కుటుంబ సభ్యులపై దాడి చేసి మూడు నెలల గర్భిణిగా ఉన్న శ్రీజను బైక్‌పై ఎక్కించుకొని బలవంతంగా లాక్కెళ్లారు.

కిడ్నాప్ కేసు పెట్టిన భర్త:

తన భార్యను ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేయించి ఉంటారనే వంశీకృష్ణ ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తన భార్య శ్రీజ‌ను బ‌ల‌వంతంగా బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఆమె మేనమామ ఉన్నాడని వంశీ పోలీస్ కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. మూడు నెలల గర్భవతి అనే కనికరం లేకుండా అత్యంత దారుణంగా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను తనకు అప్పగించాలని పోలీసులే న్యాయం చేయాలని వేడుకున్నాడు.