నవమాసాలు మోసి మగబిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి వరకట్న వేధింపులకు బలైంది. దీంతో కుటుంబీకులు రిమ్స్‌ ఆవరణలో ఆందోళనకు దిగారు. మృతురాలి భర్తతో పాటు అత్తింటి వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో రిమ్స్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుటుంబీకుల వివరాల ప్రకారం: నార్నూర్‌ మండలం సుంగాపూర్‌కు చెందిన ఐశ్వర్య (20) ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో నివాసముంటున్న బండారి మహేష్‌తో 2022 ఫిబ్రవరి 3న వివాహం చేశారు. మహేష్‌ ఆదిలాబాద్ ‌రూరల్‌ మండలంలోని యాపల్‌గూడ 32వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివాహ సమయంలో రూ.22 లక్షల కట్నం ఒప్పుకున్నారు. పెళ్లి సమయానికి రూ.10 లక్షలు ఇచ్చారు. ఐశ్వర్య గర్భం దాల్చిన తర్వాత ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. గత నెల 6వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి రూ.22లక్షల కట్నం తీసుకుని రావాలని నిత్యం ఫోన్‌లో వేధింపులకు గురిచేసేవాడు.

గతంలోనూ ఈ విషయమై ఐశ్వర్య తల్లిదండ్రులు మహేశ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయినా వేధింపులు ఆగలేదు. మనస్తాపానికి గురైన ఐశ్వర్య సోమవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందింది. దీంతో కుటుంబీకులు మహేశ్‌ను అరెస్టు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాలని ఆందోళనకు దిగారు. పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం టూటౌన్‌ సీఐ పురుషోత్తం చేరుకుని భరోసా కల్పించడంతో ఆందోళన విరమించారు.