• కోదాడలో గ్యాంగ్ రేప్ యువతి రోడ్డుపై వెళుతుంటే బలవంతంగా ఆటోలో లాక్కెళ్లిన మృగాలు.
  • శీతలపానియంలో లిక్కర్ కలిపి త్రాగించి, కొట్టి హింసించి బలాత్కారం.
  • ఆ దుర్మార్గుల చెర నుండి తప్పించుకున్న యువతి బంధువులకు సమాచారం.
  • పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు, బంధువులు.
  • విషయం బయటికి చెపితే కొడుకును లేకుండా చేస్తానని అధికార పార్టీ కౌన్సిలర్ బెదిరింపులు.
  • న్యాయం చేయాలంటున్న కుటుంబ సభ్యులు.

సూర్యాపేట జిల్లా: దేశంలో మహిళలపై, ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను,
అత్యాచారాలను అరికట్టేందుకు, నిర్భయ లాంటి ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా నిర్భయంగా
మహిళలపై మృగాళ్ల వేట కొనసాగుతూనే ఉంది. ఇద్దరు మృగాల క్రూరత్వానికి ఓ లేడిపిల్ల మూడు రోజుల పాటు విలవిల్లాడిన హృదయ విధారక సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూడడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు యువకులు ఓ యువతిపై సాగించిన దుర్మార్గపు క్రీడకు కోదాడ పట్టణం మూగ సాక్ష్యంగా నిలిచింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే:

కోదాడ పట్టణానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఖాజా కొడుకు గౌస్ మరియు సాయిరాం రెడ్డి అనే ఇద్దరు యువకులు ఓ యువతి రోడ్డుపై వెళుతుంటే బలవంతంగా ఆటోలో లాక్కెళ్లి
కూల్ డ్రింక్ లో మత్తు మందు (లిక్కర్) కలిపి మూడు రోజులుగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మృగాల పైచాచికత్వం నుండి తప్పించుకున్న యువతి జరిగిన దారుణాన్ని బంధువులకు తెలపడంతో వారు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతికి వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కుమారుడు కావడంతో పోలీసుల విచారణ సాఫీగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కోదాడ పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.