పుట్టింట జరిగే తల్లిదండ్రుల సంవత్సరికానికి భర్తతో వచ్చి తిరిగి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ మృత్యుశకమై వచ్చి వారిద్దరినీ కబళించింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా వైరాలో శనివారం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన రంగా సుభాశ్‌రెడ్డి(38)తో సత్తుపల్లికి చెందిన వనం రోజారాణి(34)కి గత నవంబరు 5న వివాహం జరిగింది. రోజారాణి ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు చేయగా, సుభాష్‌రెడ్డి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజారాణి తల్లిదండ్రుల సంవత్సరీకం ఈనెల 20న సత్తుపల్లిలో జరగ్గా, దంపతులు హాజరయ్యారు. అనంతరం వారం తరువాత శనివారం స్కూటీపై హైదరాబాద్‌ ప్రయాణమయ్యారు. తల్లాడ నుంచి వైరా వస్తున్న లారీ స్థానిక క్రాస్‌రోడ్డులో మధిర వైపు తిరుగుతున్న క్రమంలో పక్కనే వెళ్తున్న దంపతుల ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దంపతులిద్దరూ కిందపడగా లారీ వెనుకచక్రాలు వారిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

ప్రమాదం జరిగిన సమయంలో దంపతుల వాహనంపై పెంపుడు శునకం ఉండగా, దానికి ఎలాంటి గాయాలు కాలేదు. ఏసీపీ రహమాన్‌, సీఐ సురేశ్‌, ఎస్సై వీరప్రసాద్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.                                వద్దని చెప్పినా వినలేదు:
ఈనెల 18న హైదరాబాద్‌ నుంచి దంపతులు సత్తుపల్లికి వచ్చారు. ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ నుంచి వస్తుండగా అలా రావొద్దని చెప్పినా ఇద్దరు వినలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలోనూ ద్విచక్రవాహనంపై అంతదూరం వెళ్లొద్దని చెప్పినా జాగ్రత్తగా వెళ్తామంటూ చెప్పినట్లు తెలిపారు. పెళ్లయిన ఐదు నెలలకే మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.