ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్ధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బి.మోహన్‌రావు అనే ఉపాధ్యాయుడు రెండో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఎక్కాలు సరిగా చెప్పలేదంటూ వారి దుస్తులు విప్పించాడు. అందులో ఇద్దరి దుస్తులను నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినులతో విప్పించి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాక తమను దుస్తులు లేకుండా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి బెదిరించాడని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సదరు టీచర్‌ను ప్రశ్నించేందుకు సోమవారం పాఠశాలకు రాగా, ఆ ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరయ్యాడు. దాంతో పాఠశాలలో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడని, ఇలాంటి టీచర్లతో విద్యార్థినులకు ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు.

అయితే శనివారం పాఠశాల హెచ్‌ఎం శిక్షణ కార్యక్రమానికి వెళ్లగా, ఓ టీచర్‌ సెలవు పెట్టారు. మరో ఉపాధ్యాయుడు మధ్యాహ్నమే వెళ్లిపోగా, మోహన్‌రావు ఒక్కడే స్కూళ్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై పి.శ్రీకాంత్‌ అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు, డీఈఓకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో అనుచితంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.