పేదరికంలో ఉన్నా ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో అనుమానం పెను భూతమైంది. భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైంది. చివరకు కట్టుకున్న భార్య మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు భర్త.
వివరాలు: నాగరాజుతో జమలమ్మ(30)కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్(11), జోషి(8). నగరానికి వలస వచ్చి బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 5లోగల దేవరకొండ బస్తీలో నివసిస్తున్నారు. నాగరాజు కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తుండగా, జమలమ్మ ఇళ్లలో పనిచేస్తోంది. ఆర్థికంగా రాబడి తక్కువగా ఉన్నప్పటికీ సంతోషంగా ఉంటున్నారు. రెండేళ్ల నుంచి భార్యపై నాగరాజుకు అనుమానం పెరిగింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పిల్లలు నిద్రపోయిన తర్వాత కోపంతో రగిలిపోయిన నాగరాజు భార్యను కొట్టగా ఆమె తల గోడకు తగిలింది. తర్వాత తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. జమలమ్మ చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. రెండు గంటల తర్వాత పిల్లలు నిద్ర లేచి తల్లి విగతజీవిగా పడి ఉండటం చూశారు. స్థానికులకు విషయం చెప్పడంతో బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నాగరాజు కోసం గాలిస్తున్నారు.