ఇటీవల జరిగిన నవ వరుడి హత్య కేసులో చిక్కుముడి వీడింది. కట్టుకున్న భార్యే తన ప్రియుడు రాధాకృష్ణతో కలిసి పథకం ప్రకారం భర్తను కిరాతకంగా హత్య చేయించినట్లు తేలింది. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేకేటి సూర్యనారాయణ(28) ఎంఎస్సీ చదివారు. మండపేటలోని శ్రీవికాస జూనియర్‌ కళాశాల్లో అధ్యాపకుడిగా పనిచేసేవారు. గ్రామంలో సౌమ్యుడిగా పేరున్న సూర్యనారాయణకు మే 15న కరప శివారు గ్రామం పేపకాయలపాలెం వాసి మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. అంతకు రెండేళ్ల ముందు నుంచే నాగలక్ష్మికి నిందితుడు రాధాకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈనెల 21న మధ్యాహ్నం సూర్యనారాయణ అత్తవారింటి నుంచి కరపకు వచ్చి అదేరోజు సాయంత్రం తిరిగి వేపకాయపాలెం వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వెళ్తూ ఎనిమిదింటికల్లా తిరిగివస్తానని భార్యతో చెప్పిన ఆయన అప్పటి నుంచీ కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు సూర్యనారాయణ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో నిందితుడు రాధాకృష్ణ సూచనల మేరకు 22న ఉదయం పెనుగుదురు-పాతర్లగడ్డ రహదారిలో పంటపొలానికి సమీపంలో వెదకగా సూర్యనారాయణ మోటారుసైకిల్‌ కనిపించింది.

పొలంలో సూర్యనారాయణ మృతదేహం లభించింది. అతడి తలపై నరికి కిరాతకంగా హత్య చేసి గడ్డి కప్పి ఉంచడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాధాకృష్ణపై అనుమానంతో అతణ్ని తమదైన శైలిలో విచారించటంతో నేరాన్ని అంగీకరించాడు. తమ వివాహేతర బంధానికి అడ్డులేకుండా సూర్యనారాయణను అంతంచేయాలని నాగలక్ష్మి కోరడంతోనే తానీ హత్యకు పథకం రచించానని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు.