వరంగల్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం, కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక, ఈ వ్యవహరంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను పోలీసులు సోమవారం విచారించారు. పేపర్‌ లీక్‌ కేసులో ఈటలను పోలీసులు ప్రశ్నించారు. వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అబ్దుల్ బారీ ఈటలను గంటపాటు విచారించారు. కాగా, విచారణ అనంతరం ఈటల సంచలన ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ: కుట్రపూరితంగానే నాపై మోపుతున్నారు. 30లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్‌ చెలగాటం ఆడుతున్నారు. ప్రగతిభవన్‌ డైరెక్షన్‌లోనే మాపై కేసులు నమోదు చేశారు. దేశంలోనే రిచస్ట్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ సొమ్ము తెలంగాణ ప్రజలది సోకు కేసీఆర్‌ది. 22 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిని నేను. బాధ్యతగా గల పౌరుడిగా ఉన్నాను. కుట్రపూరితంగా నాపై పేపర్‌ లీక్‌ కేసు పెట్టారు. ఇది పేపర్‌ లీక్‌ కాదు మాల్‌ ప్రాక్టీస్‌ అంటారు. టీఎస్‌పీఎస్సీ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పదో తరగతి పేపర్‌ లీక్‌ను తెరపైకి తెచ్చారు. చట్టం మీద, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వ్యక్తిని నేను అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు._