ముంబైకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్‌కాదర్ షబ్బీర్ ఘోఘవాలా ఇంట్లో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం అవ్వడం జరిగింది. దీన్ని సదరు వ్యాపారవేత్త గుర్తించాడు కూడా. ఇలా కొద్ది నెలలోనే చాలా నగలు పోయాయి. కానీ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో వస్తువులు ఏదో మంత్రం వేసినట్లు మాయవుతున్నాయని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దమొత్తంలో నగదు చోరికి గురైంది. దీంతో ఇక చేసేదేమి లేక వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారవేత్త ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుకి సంబంధించి దాదాపు 40లక్షలకు పైనే దొంగతనం జరిగింది.

పోలీసులు వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగాలంటే వ్యాపారవేత్తకు తెలిసిన వ్యక్తి చేసి ఉండాలి లేదా ఇంట్లో ఉండే వ్యక్తే అయ్యి ఉండాలన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. తీరా విచారణ చేస్తే అసలు దొంగ ఆ వ్యాపారవేత్త 12ఏళ్ల మేనకోడలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. పోలీసుల విచారణలో సదరు వ్యాపారవేత్త మేనకోడలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉండే తన బంధువుని తన మావయ్య ఇంట్లో దొంగతనం చేయమని చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు బంధువుని అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40లక్షలు వరకు రికవర్‌ చేశారు. ఐతే సదరు వ్యాపారవేత్త మేనకోడలుపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఈ దొంగతనంలో ఆమె పాత్ర ఎంత వరుకు ఉందో నిర్థారించిన తర్వాత జువైనల్‌​ జస్టీస్‌ బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపుతామని పోలీసులు తెలిపారు.