దోపిడీకి పాల్పడిన ముగ్గురు హోంగార్డులను విధుల నుండి తోలగిస్తున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేసారు.

వివరాల్లోకి వెళితే గత సంవత్సరం 2018 ఆగస్టు 8వ తేది సాయంత్రం 6.30 సమయంలో కాజీపేట ఫాతీమాసెంటర్‌ నుండి వంద ఫీట్ల రోడ్డు మీదుగా KUC జంక్షన్‌ పైపు వస్తున్న లారీని హోంగార్డులు ఎస్‌.శివకుమార్‌ (నెం.686), యం.డి ఆజ్గర్‌ పాషా (నెం.632), బి.వేణు (నెం.639) కారులో వచ్చి లారీని అపి సదరు లారీ డ్రైవర్‌ వాలాద్రి నితిన్‌ రెడ్డిని కోట్టి 2వేల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. జరిగిన సంఘటనపై భాధితుడు నితిన్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దోపిడికి పాల్పడిన ముగ్గురు హోంగార్డులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది. సంబంధిత సంఘటనపై నేరానికి పాల్పడిన ముగ్గురు హోంగార్డులకు 2018 సెప్టెంబర్‌ 4వ తేదిన నిందితుల ముగ్గురి వివరణ కోరుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీచేసారు.

దీనితో నేరానికి పాల్పడిన ముగ్గురు హోంగార్డుల వివరణ అనంతరం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గారి ఆదేశాల మేరకు సినియర్‌ పోలీస్‌ అధికారి అధ్వర్యంలో సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది విచారణ నివేదికను పోలీస్‌ కమిషనర్‌కు అందజేసారు. అనంతరం మరో పోలీస్‌ కమిషనర్‌ ద్వారా గార్డులకు చివరగా 2018 డిసెంబర్‌ 10వతేదిన షోకాజ్‌ నోటీసులను జారీచేయడంతో, సదరు నేరానికి పాల్పడిన హోంగార్డుల నుండి వివరణ తీసుకోవడం జరిగింది.

అనంతరం విచారణ తుది నివేదికను పోలీస్‌ కమిషనర్‌ ద్వారా రాష్ట్ర హోంగార్డ్స్‌ ఐ.జీ కార్యాలయానికి పంపడంతో పాటు, రాష్ట్ర స్థాయి క్రమశిక్షణ సంఘం ఎర్పాటుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కోరడంతో, దీనిపై రాష్ట్ర స్థాయి క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ నెల 18వ తేదిన హోంగార్డ్స్‌ ఐ.జీ ఉత్తర్వులు జారీచేయడంతో దోపిడీకి పాల్పడిన ముగ్గురు హోంగార్డ్స్‌పై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం విచారణ నిర్వహించి చివరగా హోంగార్డ్స్‌ ముగ్గురు దోపిడీకి పాల్పడినట్లుగా నేరం నిరూపణ కావడంతో దోపీడీకి పాల్పడిన ముగ్గురు హోంగార్డులను విధులను తోలగిస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేసారు.

చట్టాలను అమలు చేసే సిబ్బంది చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు.