ఒకరి మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

రాజీవ్‌ రహదారి తూంకుంట గ్రామ పరిధిలోని అలంక్రితా రిసార్టు వద్ద ఆదివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళుతున్న ఆరుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శామీర్‌పేట SI రజాక్‌ తెలిపిన వివరాల ప్రకారం. దేవరయంజాల్,‌ మందాయపల్లి గ్రామాలకి చెందిన ఆరుగురు కూలీలు పని నిమిత్తం అలంక్రిత రిసార్టుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన కారు , వీరిని ఢీకొట్టింది. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొదుతూ దేవరయంజాల్‌ గ్రామానికి చెందిన లక్ష్మి(40) మృతి చెందింది. మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.