బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో దారుణం జరిగింది. నడుస్తున్న కారులో దాదాపు 4 గంటలపాటు యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు: నగరంలోని ఈజీపురకు చెందిన ఓ యువతి, తన స్నేహితుడితో కలిసి మార్చి 25న రాత్రి 9.30 గంటల సమయంలో కోరమంగళలోని పార్కులో కూర్చుంది. ఇద్దరూ సిగరెట్‌ తాగుతుండగా దగ్గర్లోనే కూర్చున్న ఓ యువకుడు పొగతో ఇబ్బందిగా ఉందంటూ వాదనకు దిగాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిన అతడు, మరో ఇద్దరు స్నేహితులతో తిరిగి వచ్చాడు. బెదిరించి యువతి స్నేహితుడి అక్కడి నుంచి పంపించివేశారు.

అనంతరం రాత్రి 11 గంటల సమయంలో మరో స్నేహితుడు కారులో రాగా అందరూ కలిసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారు నడుస్తుండగానే నలుగురూ ఒకరితర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈజీపురలోనే రోడ్డు పక్క ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సతీశ్, విజయ్, శ్రీధర్, కిరణ్‌ అనే 22-26 ఏళ్ల నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు కూడా ఈజీపురకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు.