జగిత్యాల జిల్లా మున్సిపల్‌ ఛైర్‌పర్మన్‌ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మీడియా ఎదుటే కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని కంటతడి పెట్టుకున్నారు. తన రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపినట్టు చెప్పారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ: పేరుకు మాత్రమే నేను ఛైర్‌ పర్సన్‌ను పెత్తనమంతా ఎమ్మెల్యేదే. బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష కట్టారు. ఎమ్మెల్యే నన్ను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మీకు పిల్లలు ఉన్నారు వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బులు కోసం డిమాండ్ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పాము. అన్ని పనులకు అడ్డొస్తున్నారు. చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా మారింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. మూడు సంవత్సరాల నుండి అవమానాల కారణంగా నరకం అనుభవిస్తున్నాను.

ఎమ్మెల్యే అడ్డుపడినప్పటికీ అభివృద్ధివైపే ఉన్నాము. నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. ఆయన చెప్పింది మాత్రమే వినాలి అదే మాట్లాడాలి. ఒక్క పని కూడా నా చేతులతో ప్రారంభించకుండా చేశారు. అనుకూలంగా ఉన్న కొద్ది మంది కౌన్సిలర్లకు టార్చర్ చూపించేవారు. అందరి ముందు అవమానించేవారు. పార్టీ కోసమే పని చేస్తామని పలుమార్లు వేడుకున్నా కూడా వినకుండా కక్ష గట్టారు. ఎమ్మెల్యేతో మాకు ఆపద ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణం అవుతారు. రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకుంటున్నాను. ప్రస్తుతానికి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను అంటూ ఆవేదన ‍వ్యక్తం చేశారు..