పాత కక్షలతో కొందరు వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి కత్తులతో ఒక కుటుంబంపై దాడి చేయగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నూకలమర్రి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన పొత్తురి ఎల్లయ్య, అర్జున్, దొంతుల ధృవ కుమార్‌లపై నలుగురు వ్యక్తులు గీత కార్మికులు వినియోగించే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి, గాయపరిచారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా నిందితులు పరారయ్యారు. గాయపడిన వారిని వేములవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. రూరల్ ఎస్‌ఐ రమేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని, నిందితులు పొత్తురి ప్రశాంత్, తిరుపతి, స్వామి, భారతీలను సోమవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.