అర్ధరాత్రి తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లి ఘోరం
నిందితుడిని చావకొట్టిన జనం.. అరెస్టు
బహిరంగంగా ఉరితీయాలంటూ ఆందోళన
వరంగల్‌ అర్బన్‌: మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణం. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొనే ఘోరం. ఆప్యాయంగా ఎత్తుకొని ముద్దు చేయాల్సిన చేతులు ఆ తొమ్మిది నెలల పాపను కర్కశంగా కబళించాయి. తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న చిన్నారి అదృశ్యమై కొద్దిసేపటికి మృతదేహంగా లభ్యమైంది. ఓ మానవమృగం ఆ చిన్నారిపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లిలో ఈ హేయమైన ఘటన చోటుచేసుకుంది. లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ ఘోరాతిఘోరమైన స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన స్థానికుల గుండెలూ చెరువయ్యాయి. పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. చిన్నారి తల్లిదండ్రులు హైదరరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉంటున్నారు. తండ్రి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌. తల్లి గృహిణి. పెళ్లయిన ఐదేళ్లకు పాప పుట్టడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

పుట్టు వెంట్రుకలు తీసేందుకు మూడు రోజుల క్రితం వేములవాడకు వెళ్లారు. హన్మకొండలో బంధువుల పంక్షన్‌ ఉండడంతో హాజరయ్యేందుకు తిరుగు ప్రయాణంలో హన్మకొండలోనే ఉంటున్న పాప అమ్మమ్మగారి ఇంట్లో ఆగారు. మంగళవారం రాత్రి మేడపై నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున 2గంటల సమయంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం వసంతాపూర్‌ గ్రామానికి చెందిన పోలెపాక ప్రవీణ్‌ (25) పాపను ఎత్తుకెళ్ళాడు. అరగంట తర్వాత పాప కనిపించడం లేదని గుర్తించిన తల్లి.. తన తమ్ముడిని అప్రమత్తం చేసింది. అతడితో పాటు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులంతా పరిసరాల్లో వెతికారు. 100కు డయల్‌ చేయడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పరిసరాల్లో వెతుకుతుండగా పాపను టవల్‌ల్లో చుట్టి తీసుకెళుతున్న ప్రవీణ్‌ను గమనించి వెంబడించారు. గుర్తించిన ప్రవీణ్‌ చేతుల్లో ఉన్న పాపను దూరంగా విసిరేసి పరుగుతీశాడు. అతడిని వెంటాడి పట్టుకున్న యువకులు తీవ్రంగా కొట్టారు.

పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పాప.. తీవ్ర రక్తస్రావంతో ఎలాంటి కదలికలు లేకుండా ఉండడంతో హుటాహుటిన మాక్స్‌కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందింది. పాప మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు నిందితుడిపై 366, 302, 376ఎ, 376 ఏబీ, 379 ఐపీసీ సెక్షన్లతో పాటు 5(ఎం) రెడ్‌విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు హన్మకొండ ఏసీపీ చల్లా శ్రీధర్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం ప్రవీణ్‌ను కోర్టుకు అప్పగించగా రాత్రి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా నిందితుడు ప్రవీణ్‌ను బహిరంగంగా ఉరితీయాలంటూ పాప కుటుంబసభ్యులు, స్థానికులు, వివిధ ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశారు. హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట భైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోస్టుమార్టం అనంతరం పాప మృతదేహంతో హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా పాప తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు.

పాప కోసం మాటు వేశాడు

ప్రవీణ్‌ అర్ధరాత్రి తిరుగుతూ అవకాశం దొరికితే దొంగతనాలు లేదంటే లైంగిక దాడులకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇటీవల కొందరు మహిళలను చూస్తూ అశ్లీలంగా ప్రవర్తిస్తుండడంతో స్థానికులు హెచ్చరించారు. పాప అమ్మమ్మ ఇంటికి సమీపంలో ఉండే ప్రవీణ్‌.. ఘటనకు ముందు రోజు కూడా పాప దగ్గరకు వెళుతుండడంతో గమనించిన చుట్టుపక్కల
బెదిరించడంతో పరారయ్యాడు. ఈ క్రమంలో మాటువేసిన అతడు అర్ధరాత్రి తల్లి గాఢనిద్రలో ఉండగా పాపను ఎత్తుకెళ్లాడు.