నిర్భయ హత్యాచార కేసులో ఇద్దరు దోషులు వినయ్ శర్మ, ముకేష్ వేసిన క్యురేటివ్‌ పిటిషన్లను ఈనెల 14న సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తుంది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ఐదుగురి ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుంది. ఉరిశిక్ష ముందు దోషులకు ఉన్న చిట్ట చివరి న్యాయపరమైన అవకాశం ఇదే కావడం గమనార్హం.

నిర్భయ ఘటన జరిగిన సమయానికి తనకు 19 సంవత్సరాలేనని వినయ్‌ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన కుటుంబం చాలా పేదదని, తాను లేకపోతే తల్లిదండ్రులు అన్యాయమైపోతారని వాళ్లు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయాడు.

జైలులో తన సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని మరణశిక్ష నుంచి విముక్తి కల్పించాలని వినయ్‌శర్మ తన పిటిషన్‌ ద్వారా న్యాయస్థానాన్ని కోరాడు. నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ దిల్లీ పటియాలా కోర్టు తీర్పు వెలువరించి ఈనెల 22న ఉదయం 7గంటలకు తిహార్‌ జైల్లో వీరిని ఉరి తీయాలని ఆదేశించింది. ఆలోగా దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే వినయ్‌ శర్మ, ముకేశ్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.