దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు పటియలా హౌస్‌ కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాల ఇచ్చే వరకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలని ఆదేశించింది. ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్‌ వారెంట్‌ ప్రకారం శనివారం (ఫిబ్రవరి 1న) ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులకు ఉరితీయాల్సి ఉంది.

Advertisement

అయితే చివరి నిమిషంలో మరో దోషి వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. దీంతో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ గురువారం పటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి డెత్‌ వారెంట్‌పై స్టే విధిస్తూ ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది.
మరోవైపు నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నిర్భయ సామూహిక అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సమీక్షించాలంటూ పవన్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం, దానిని కొట్టివేసింది. ప్రస్తుతం వినయ్‌ శర్మ అనే దోషి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు.