చిన్నవయసు, పేదరికం , పాపం పసిపాప జీవితం నరకమైంది ఉన్నపళంగా ఎముకల క్యాన్సర్ కబళించింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటలో కళ్ళు చెమ్మగిల్లే దారుణమిది. రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబం. బాలిక తల్లి లక్ష్మి ఇంట్లోనే ఉంటూ బీడీలు చుడుతూ పదో పరకో వచ్చేలా తాపత్రయపడుతుంటుంది. నాన్న కిష్టయ్యకు కూలిపని దొరికితేనే కడుపు నిండేది.

Advertisement

ఆరో తరగతి చదువుతున్న బిడ్డ ఒకరోజున ఆడుకుంటూ జారిపడినప్పటి నుంచి కష్టాలే చక్కగా చదువుతూ చలాకీగా ఆడుతూ పెరగాల్సిన కూతురు తమ కళ్లముందే నిత్యం నరక యాతన పడుతోందని తల్లిదండ్రులు తల్లడిల్లని క్షణమంటూ లేదు. తల భాగం ఆరు నెలల్లోనే విపరీతంగా ఉబ్బింది. దిగువకు విస్తరించి, చివరికి ఒక కన్ను పూర్తిగా మూసుకుపోయింది. ఇదీ పదేళ్ల ‘వర్ష’ హృదయ విదారక విషాద గాధ.సిద్దిపేటకు చేరిన వారు పాడుబడిన పెంకుటింట్లో కిరాయికి ఉంటున్నారు.

వాపు , కాయ రూపంలోకి మారి, కంతిగా రూపాంతరం చెంది, ఎముకల క్యాన్సర్‌గా దాపురించిందని వైద్యపరీక్షల్లో బయటపడింది. ప్రాణాంతక వ్యాధి ఈ పసిదాన్ని క్రమేణా కబళిస్తోంది. వైద్యానికి ఆరు నెలల్లో రూ.4 లక్షలు ఖర్చుచేయాల్సిన స్థితి పేద బతుకుల్ని మరింతగా కష్టాల కడలిలో ముంచెత్తింది. చుట్టుముట్టిన వ్యాధి, చేయించాల్సిన వైద్యం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. క్షణం ఓ యుగంలా గడుస్తోంది!