చనిపోతున్నానని వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టి ఓ యువతి అదృశ్యమైన సంఘటన శుక్రవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఘాన్సీబజార్‌కు చెందిన అమీనా సుల్తానా ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన కుమార్తె అలినా హమీద్‌(19)కు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తోంది.

ఈ విషయం కుమార్తెకు చెప్పడంతో తాను నవాజ్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతనిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో అమీనా సుల్తానా నవాజ్‌కు ఫోన్‌ చేసి పెళ్లి విషయం ప్రస్తావించగా అలినాను పెళ్లి చేసుకునేందుకు అతను నిరాకరించాడు. కొన్ని రోజుల క్రితం అలినా రిసాలాబజార్‌లో ఉంటున్న పిన్ని ఇంటికి వెళ్లింది. గురువారం సాయంత్రం తాను చనిపోతున్నట్లు తల్లిదండ్రులకు వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టి బయటికి వెళ్లింది. అలినా ఆచూకి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె తల్లి అమినా సుల్తానా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.