వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తమిళ హీరో సూర్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉందన్న విషయమూ తెలిసిందే. జగన్ ఏర్పాటు చేసిన భారతి సిమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ సూర్య కొనసాగారు. తన తాజా చిత్రం ఎన్జీకే ప్రమోషన్ లో భాగంగా సూర్య మంగళవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సూర్యకు… జగన్ గెలుపుపైనా ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జగన్ పార్టీ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది కదా. దీంతో జగన్ గెలుపుపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ గెలుపుపై సూర్య ఏమన్నారంటే… ‘చాలా సంతోషంగా ఉంది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. తను ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రస్తుతం ఆయనపై హిమాలయాలంత బరువు ఉంది. ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటారని ఆశిస్తున్నాను‘ అని సూర్య వ్యాఖ్యానించారు. నేను ఎప్పుడూ జగన్ అన్న అని పిలుస్తుంటాను. ఆయన కుటుంబం మొత్తం నాకు తెలుసు. మంచి సంబంధాలున్నాయి. జగన్ ఎప్పుడు చెన్నై వచ్చినా మేమిద్దరం కలిసి ఐస్ క్రీమ్స్ తింటాం. మా ఇద్దరికీ కామన్ ఎంటర్ టైన్ మెంట్ అదే. 4-5 ఐస్ క్రీమ్స్ తినేసి మళ్లీ వెనక్కి వచ్చేస్తాం.” ఇలా జగన్ తో తనకున్న స్నేహబంధాన్ని గుర్తుచేసుకున్నాడు సూర్య.. ‘యాత్ర 2’లో మీరు నటిస్తారని వార్తలొచ్చాయి అని అడగగా.. ‘ఆ కథ , నా వరకూ వచ్చి, స్క్రిప్టు నచ్చితే తప్పకుండా చేస్తా’ అని ఆయన పేర్కొన్నారు.