విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి తాను ఆయన భక్తుల జాబితాలో ఉన్నానని, ఆశ్రమానికి వస్తున్నానని చెప్పడంపై సినీ గాయని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏనాడూ స్వరూపానంద సరస్వతి ఆశ్రమానికి పోలేదని, ఆయనతో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. స్వరూపానంద ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిరంజీవి, రజనీకాంత్ తనవద్దకు వస్తుంటారని, అదేవిధంగా గాయని సునీత కూడా వస్తుంటారని చెప్పారు. యూట్యూబ్‌లో ఈ ఇంటర్వ్యూ చూసిన సునీత ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. వీడియో క్లిప్‌ను షేర్‌ చేస్తూ.. ‘రోజూ ఎన్నో వదంతులు కనిపిస్తుంటాయి, కానీ, కొన్ని విషయాల గురించే స్పందించాల్సి అవసరం వస్తుంది. ప్రముఖ వ్యక్తి స్వరూపానంద సరస్వతి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు ఎలా చెబుతారు?. ఓ నేషనల్‌ ఛానెల్‌లో ఇతరుల పేరును ఎలా ఉపయోగిస్తారు?.. ఆశ్చర్యంగా ఉంది’ అని పోస్ట్‌ చేశారు.