నైట్రోజెన్ గ్యాస్ పీల్చి తల్లీకూతుళ్లు బలవన్మరణం ?

భర్త హఠాన్మరణంతో మానసికంగా కుంగిపోయిన ఓ మహిళ కుమార్తెను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ మెట్టుగూడకు చెందిన ఆర్తి, సిద్ధార్థ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె తషీ(7) ఉంది. ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేసే సిద్ధార్ధ ఈ ఏడాది జూన్‌ నెలలో గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటినుంచి అత్తింట్లోనే ఉంటున్న ఆర్తి తరచూ భర్తను తలచుకుంటూ మానసికంగా బాధపడుతోంది. పుట్టింటికి రావాలని తల్లి ఒత్తిడి చేసినా వెళ్లకుండా తన భర్త ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పుకునేది. తనకు ఏదైనా జరిగితే కుమార్తెను బాగా చూసుకుంటారా అంటూ తరచూ అత్తింటివారిని అడిగేది.
ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం ఆన్‌లైన్‌లో నైట్రోజన్‌ సిలిండర్‌ బుక్‌ చేసింది. దీనిపై కుటుంబసభ్యులు ప్రశ్నించగా ప్రశ్నించగా తన స్నేహితురాలిదని, ఆమె ఊర్లో లేనందున ఇక్కడ డెలివరీ చేసినట్లు తెలిపింది.

శుక్రవారం ఉదయం బయటికి వెళ్లిన తన అత్తకు మరిది సెల్‌ నుంచి కాల్‌ చేసి తన ఫోన్‌ పనిచేయడం లేదని చెప్పింది. మరిదిని మరో పనిపై బయటికి పంపిన అనంతరం కుమార్తె తషీ ముఖానికి పాలిథిన్‌ కవర్‌ తొడిగి పైప్‌ద్వారా నైట్రోజన్‌ను లోపలికి పంపించి హత్య చేసింది. అనంతరం తానూ పాలిథిన్‌ కవర్‌ ధరించి పైప్‌ను నోట్లో పెట్టుకుని నైట్రోజన్‌ పీల్చి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగివచ్చిన కుటుంబసభ్యులు విగతజీవులుగా పడిఉన్న తల్లిబిడ్డలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వీరి ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలం మృతురాలి భర్త సిద్ధార్ధ పేరున ఉండడం, సదరు స్ధలంపై వివాదాలు నడుస్తున్న నేపధ్యంలో ఈ వివాదానికి తల్లిబిడ్డల మృతికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.