పుల్వామా ఉగ్రదాడిలో తమ దేశ ప్రమేయం లేదని, ఊరికే నిందలు మోపడం సరికాదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దాడి తర్వాత పాక్‌పై విమర్శల నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. కశ్మీర్‌లో జరిగిన జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడికి, తమ దేశంతో సంబంధముంని చెప్పే ఆధారాలెక్కడున్నాయి? అని ప్రశ్నించారు. అసలు భారత జవాన్లపై దాడి చేయాల్సిన అవసరం తమకేంటని అన్నారు.
ఆ దాడిపై విచారణకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ భారత్ ఎటువంటి ఆధారాలను ఇప్పటివరకూ మాకు చూపలేదు. ఆధారాలు ఉంటే మాకివ్వండి, చర్యలు తీసుకుంటాం. అంతేగాని, ఊరికే పాక్ పాత్ర ఉంది, ఉంది అని చెబితే సరిపోదు. ఒక దేశం ఇలా చేసింది, అలా చేసిందని, మరో దేశం ఎలా నిందిస్తుంది? అనవసరంగా ఒక జాతిపై, ఒక దేశంపై మీద అన్యాయంగా ఉగ్రవాదముద్ర వేస్తారా? దీన్ని మేం సహించం…’ అని అన్నారు.

దీటుగా బదులిస్తాం:

భారత్ తమ దేశంపై యుద్ధం ప్రకటిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పాక్ ప్రధాని హెచ్చరించారు. ‘యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం చాలా తేలిక. కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండి, మీరు దాడి చేస్తారా? అయితే మేమూ అందుకు సిద్ధమే. సరిహద్దుల్లో ఇప్పుడిప్పుడు శాంతిసామరస్యాలు నెలకొంటున్నాయి. సౌదీ యువరాజు మా దేశానికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో మేం ఉగ్రవాద దాడి చేసి ఏం బావుకోవాలి? భారత్ గతాన్ని మరిచిపోయి, వర్తమానంలో జీవించాలి’ అని చెప్పుకొచ్చారు….