పాకిస్థాని హిందూ డెంటల్ కాలేజీ విద్యార్థిని సింధ్ ప్రావిన్స్ లోని తన హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. అయితే అత్యాచారానికి, తరువాత హత్యకు గురైందని పోస్టుమార్టమ్ తుది నివేదిక వెల్లడించింది. సింధు ప్రావిన్స్ లోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న నిమృత చాందిని సెప్టెంబర్ 16న తన హాస్టల్ గదిలో మెడకు తాడుతో పక్కపై పడి ఉండడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. చాంద్‌కా మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉమన్ మెడికో లీగల్ ఆఫీసర్ డాక్టర్ అమృత బుధవారం పోస్టుమార్టమ్ తుది నివేదిక విడుదల చేశారు.

మృతురాలు హత్యకు ముందు లైంగికంగా అత్యాచారానికి గురైనట్టు పోస్టుమార్టమ్ నివేదిక వెల్లడించింది. ఊపిరాడక పోవడం వల్లనే ఆమె మృతి చెందినట్టు నివేదికలో వెల్లడైంది. మృతురాలి దుస్తులపై పురుష వీర్యం అవశేషాలు ఉన్నట్టు డిఎన్‌ఎ పరీక్షలో నిర్ధారణ అయింది. అలాగే జననేంద్రియంలో బలవంతంగా లైంగిక చర్య జరిగినట్టు తేలింది.

మొదటి పోస్టు మార్టం నివేదిక ఆత్మహత్యగా మాత్రమే వెల్లడించడం అనేక విమర్శలకు దారి తీసింది. అంతేకాదు పారదర్శకంగా పరిశోధన చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళనలు సాగాయి. దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తునకు సెప్టెంబర్ 18న సింధ్ హైకోర్టు ఆదేశించింది.