భార‌త్‌కు చెందిన యుద్ధ విమానాల‌ను కూల్చేసిన‌ట్లు పాక్ చెబుతోంది. ఓ పైల‌ట్‌ను కూడా బంధించామ‌న్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది పాక్ మిలిట‌రీ. అయితే ఈ వీడియో ఎంత వ‌ర‌కు వాస్త‌వ‌మో తెలియ‌దు. కానీ అరెస్టు చేసిన పైల‌ట్‌తో వీడియోలో మాట్లాడించారు. నా పేరు వింగ్ క‌మాండ‌ర్ అభి నంద‌న్‌. నా స‌ర్వీస్ నెంబ‌ర్ 27981. నేను ఫ్ల‌యింగ్ పైల‌ట్‌ను. నాది హిందూ మ‌తం అని ఆ వీడియోలో ఆ పైల‌ట్ తెలిపాడు. మ‌రింత స‌మాచారం కావాల‌ని అధికారులు అడగ్గా.. తాను ఇంతే చెప్ప‌గ‌ల‌న‌న్నాడు. పాక్‌కు చెందిన జియో ఛాన‌ల్ ఆ వీడియోను ప్లేచేసింది.గాయ‌ప‌డ్డ మ‌రో పైల‌ట్ ప్ర‌స్తుతం చికిత్స‌లో ఉన్న‌ట్లు పాక్ వెల్ల‌డించింది.

వాస్తవం కాదు.. ఖండించిన భారత్‌

శ్రీనగర్‌: తమ‌ భూభాగంలోకూల్చేసిన విమానంలో ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లుపాక్‌ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ అనే పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ చెబుతోంది. ఈ వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అని ఆ వ్యక్తి వెల్లడిస్తున్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. అయితే భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాక్‌ ప్రకటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగానే ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.