వీరుడా .. ఇదా నీ పరాక్రమం ..

నిన్న సరిహద్దుల వెంట జరిగిన గగనతల పోరాట వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ సేనలకు చిక్కిన అభినందన్ మనదేశంలోకి చొరబడ్డ పాక్ విమానాలను తరిమికొట్టి పాక్ F -16 విమానాన్ని కూల్చివేసి మిగిలిన విమానాలను వెంటాడుతూ చిక్కిపోయాడట. మొత్తం 24 యుద్ధవిమానాలు ఒక్కసారిగా భారత్‌ భారత భూభాగంలోకి చొరబడ్డాయి. ఉదయం 9.45 సమయంలో ఎనిమిది ఎఫ్‌16లు, నాలుగు మిరాజ్‌ -3, నాలుగు జేఎఫ్‌-17 విమానాలు సమూహంగా నియంత్రణ రేఖ దాటి చొచ్చుకొచ్చాయి. వీటికి రక్షణగా కొన్ని విమానాలు నియంత్రణ రేఖకు అవతలవైపు సిద్ధంగా ఉన్నాయి. నియంత్రణ రేఖ దాటిన పాక్‌ విమానాలను భారత వాయు సేనకు చెందిన ఎనిమిది విమానాలు అడ్డుకొన్నాయి. వీటిల్లో నాలుగు సుఖోయ్‌ 30లు, రెండు మిరాజ్‌ 2000, రెండు మిగ్‌21బైసన్‌లు ఉన్నాయి.

మిగ్‌21లలో ఒక దానిని వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ నడిపారు. అతడు ఒక ఎఫ్‌16 పైకి ఆర్‌-73 క్షిపణిని ప్రయోగించాడు. మరో వైపు నుంచి పాక్‌ ఎఫ్‌16 కూడా రెండు ఏఎంఆర్‌ఏఏఎం క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో ఒకటి అభినందన్‌ విమానాన్ని తాకింది.
ఈ క్రమంలో ఎఫ్‌16 విమానం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భూభాగంలో కూలిపోయింది. ‌ రెండు విమానాల్లో పైలట్లు నియంత్రణ రేఖకు అవతల నేలపైకి దిగారు. వీరిలో పాక్‌ ఎఫ్‌16 పైలట్ల పరిస్థితి ఇప్పటి వరకు తెలియదు.