జమ్మూ కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్గటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాక్‌పై ప్రతీకార దాడికి దిగుతుందా? లేదంటే అంతర్జాతీయ సమాజాం ముందుకొచ్చి చర్చలతో దీనికి పరిష్కారం చూపిస్తుందా అనే చర్చకూడా జరుగుతోంది. అదేవిధంగా రెండు దేశాల మధ్య అణు యుద్ధం వచ్చే అవకాశాలు ఉందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లోని ఆయన ముషరఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ భారత్ – పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. అలా అని అణు దాడులేం జరగవు. ఒకవేళ పాకిస్తాన్ గనుక భారత్‌పై ఒక్క అణు బాంబు వేస్తే.. భారత్ 20 అణుబాంబులతో మనపై దాడి చేస్తుంది. అందుకే భారత్ 20 అణుబాంబులతో మనపై విరుచుకుపడకుండా ఉండాలంటే.. ముందు మనమే 50 అణుబాంబులతో దాడి చేయాలి. అందుకే 50 అణుబాంబులతో యుద్ధం మనవైపు నుంచి మొదలుపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అంటూనే ‘అది అత్యంత ప్రమాదకరం.. అణు యుద్ధం గురించి మాట్లాడేవారికి యుద్ధనీతిపై అవగాహన లేదు. అది అమాయకుల భ్రమ’ అని చెప్పుకొచ్చారు. ముషరఫ్ పుల్వామా ఘటనను ఖండించకపోగా.. భారత్ ఎదురుదాడికి దిగకముందే పాక్ మరో దాడికి పాల్పడాలని సలహాలిస్తున్నారు.