జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ షాంపూ, పౌడర్‌ అమ్మకాలను నిలుపుదల చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌) లేఖలు పంపింది. అలాగే, ఇప్పటికే దుకాణాల్లోకి వెళ్లిన జాన్సన్‌ ఉత్పత్తులను వెనక్కి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. జాన్సన్‌ ఉత్పత్తుల శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించి నివేదిక పంపాలని ఆదేశించింది. జైపూర్‌లోని డ్రగ్స్‌ టెస్టింగ్‌ లేబరేటరీలోని ప్రభుత్వ నిపుణులు ఇచ్చిన నివేదికను జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘానికి రాజస్తాన్‌ ప్రభుత్వం అందజేసింది. జాన్సన్‌ ఉత్పత్తుల్లో ఫార్మల్‌ డీహైడ్‌ ఉండటంతో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని రాజస్థాన్‌ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.

జాన్సన్‌ ఉత్పత్తులలో ఆస్‌బెస్టాస్‌, కార్సినో జెనిక్‌ కారకాలు ఉన్నాయని మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ, రాజస్తాన్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలు జాన్సన్‌ ఉత్పత్తుల నమూనాలు పరిశీలించి నివేదిక పంపాలని ఎస్‌సీపీసీఆర్‌ కోరింది. ఈ విషయంపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ జాతీయ బాల హక్కుల రక్షణ సంఘం ఆదేశాలు తమ దృష్టికి రాలేదని పేర్కొంది. సెంట్రల్‌ డ్రగ్స్‌ లాబరేటరీలో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ తెలిపింది.