ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. ఇందుకు 50 శాతం వరకు పురుషుల్లో లోపాలే కారణమవుతున్నాయి. వీర్యం ఉత్పత్తి కాకపోవడం, శుక్రకణాలు తక్కువ ఉత్పత్తి కావడం, వాటి ఆకృతి అసాధారణంగా ఉండటం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, మద్యపానం అలవాటు వంటి జీవనశైలి సమస్యలు వంధ్యత్వానికి దారితీస్తున్నాయి. చాలామంది పురుషుల్లో సంతానలేమి సమస్యకు వై క్రోమోజోమ్‌లోని కొన్ని భాగాలను కోల్పోవడమే ప్రధాన కారణమని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపం భారతీయుల్లోనే ఎక్కువని అధ్యయనకర్తలు తేల్చారు.

శుక్రకణాల (స్పెర్మాటోజనిసెస్‌) ఉత్పత్తికి వై క్రోమోజోమ్‌లోని చాలా జన్యువులు కీలకం. ముఖ్యంగా 8.5 శాతం కేసుల్లో కొన్ని జన్యువులు లేకపోవడంతో పురుషుల్లో వంధ్యత్వానికి కారణంగా ఇదివరకే తేల్చారు. తాజా అధ్యయనంలో సంతానలేమికి క్రోమోజోమ్‌లోని అజూస్పెర్మియా(ఏజెడ్‌ఎఫ్‌) ప్రాంతంలో కొన్ని భాగాలు కనిపించకుండా పోవడమే కారణంగా గుర్తించారు. 973 మంది లోపాలు ఉన్న పురుషులు, 587 మంది వీర్యం కౌంట్‌లో సమస్య లేని పురుషులకు వేర్వేరు పద్ధతులు, డీఎన్‌ఏ మార్కర్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 29.4 శాతం మందిలో ఏజెడ్‌ఎఫ్‌ క్రోమోజోమ్‌ ప్రాంతంలో భాగాలు లేకపోవడం గుర్తించారు.