ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లిన తనపై అకారణంగా దాడి చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది . దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . బాధితురాలు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . హన్మకొండకు చెందిన విజయలక్ష్మి శుక్రవారం సాయంత్రం హన్మకొండ కేయూ రోడ్డులోని గొల్లపల్లె పెట్రోల్ బంకులోకి పెట్రోల్ పోసుకోవడానికి వెళ్లింది . అక్కడ పనిచేస్తున్న గండ్ర భూపాల్ రెడ్డి , అభిలాష్ అనే ఇద్దరు వ్యక్తులు తనపై మూకుమ్మడిగా దాడిచేసి రక్తం వచ్చేలా గాయపరిచినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది . తనకు న్యాయం చేయాలని , వారితో తనకు ప్రాణహాని ఉందని హన్మకొండ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది . వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలిని తీసుకుని దాడి జరిగిన పెట్రోల్ బంకు వద్దకు వెళ్లారు . పోలీసులు అక్కడి వారిని విచారించగా సదరు మహిళ పెట్రోల్ బంకు లోకి వస్తూనే తమను దూషించిందని అక్కడ పనిచేసే సిబ్బందిని చొక్కా పట్టి దాడి చేసిందని పేర్కొన్నారు .

గతంలో గండ్ర కుటుంబంపై పగతో కేసులు కూడా పెట్టిందని వారు పోలీసులకు వివరించారు . మహిళ చేసిన దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీలు తమ వద్ద ఉన్నాయని , కావాలనే ఆ మహిళ గొడవ సృష్టించిందని వారు తెలిపారు . వెంటనే హన్మకొండ పోలీసులు మహిళను వైద్య పరీక్షల కోసం ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు . ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తు అన్నట్టు పోలీసులు తెలిపారు .