చైనా, అమెరికాల్లో తాజాగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా తాజాగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని. ఆంక్షలు, మార్గదర్శకాల అమలును కొనసాగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాజేశ్ భూషణ్ శుక్రవారం లేఖ రాశారు. కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు రాజేశ్ భూషణ్ లేఖ అందింది.

గతవారం కేరళలలో 2,321 కేసులు రికార్డయ్యాయి. దేశంలోని కొత్త కేసుల్లో 31.8 శాతం కేరళలోనే ఉన్నాయి. కేరళలో వారాంతపు పాజిటివిటీ రేటు 13.45 నుంచి 15.53 శాతానికి పెరిగిపోయింది. కరోనాని నియంత్రించడానికి ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాజేశ్ భూషణ్ సూచించారు. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌తోపాటు కరోనా మార్గదర్శకాలను అమలు చేయాలని తెలిపారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో వారం (ఏప్రిల్ 8 నాటికి) లో కొత్త కేసులు 724 నుంచి 826కు చేరాయి. ఇది దేశంలోని మొత్తం కేసుల్లో 11.33 శాతం. పాజిటివిటీ రేట్ 0.51 నుంచి 1.25 శాతం.