ఘనమైన ఏర్పాట్లతో అంగరంగ వైభవంగా జరిగిందో పెళ్లి వేడుక. అంతలోనే ఎవ్వరూ ఊహించని విధంగా ఘోరం చోటు చేసుకుంది. పెద్దల సందడి, పిల్లల కేరింతలు, బాజాభజంత్రీలతో ఎంతో సంబరంగా కనిపించిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. తాళి కట్టిన పెళ్లి కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి చేసుకున్న భార్యను ఒంటరి దాన్ని చేశాడు. బిహార్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది. పూర్తి వివరాలు: బిహార్‌, బాగల్‌పూర్‌లోని జువాకోటి ప్రాంతానికి చెందిన 31ఏళ్ల దిలీప్‌ ప్రకాశ్‌ ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కుమారుడు జాబ్‌లో సెటిల్‌ అయ్యాడు కదా అని పెద్దలు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. జార్ఖండ్‌కు చెందిన ఆయుషి అనే అమ్మాయితో పెళ్లి నిశ్చియం చేశారు. మే 3న ముహ్తూం ఫిక్స్‌ అయింది. తెల్లవారితే పెళ్లి. ఈ సమయంలో ప్రకాశ్‌ తనకు గొంతులో నొప్పిగా ఉందని గుండెలో ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు.

పెళ్లి హడావిడిలో వారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎసిడిటీ అయి ఉంటుందని భావించి మందులు వేసుకోమని చెప్పారు. పెళ్లి తంతు మొదలైంది ప్రకాశ్‌, ఆయుషి మెడలో మూడు ముళ్లు వేశాడు. కుమారుడి పెళ్లి చూసి అతడి తల్లిదండ్రులు ఆనందంలో మునిగి తేలారు. కానీ, వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కొంత సేపటి తర్వాత వధూవరులతో సహా కుటుంబసభ్యులంతా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలసిపోయిన ప్రకాశ్‌, బాత్‌ రూముకు వెళ్లి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంతే అలాగే సోఫాలో వెనక్కు వాలిపోయి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బంధువులంతా అతడ్ని లేపటానికి ప్రయత్నించారు. ఉలుకు, పలుకు లేకపోవటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతడ్ని పరీక్షించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో అతడి తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. ఈ విషయం కొద్ది క్షణాలకే ఆయుషికి తెలిసింది. ఆ వార్త విన్న ఆయుషి గుండెలవిసేలా ఏడ్చింది. ఆ బాధలో ఆమె స్ప్రహ తప్పిపడిపోయింది.