మంగళవారం తాను నడుపుతున్న వాహనం అదుపుతప్పి మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు భూదాన్‌పోచంపల్లి ఎస్‌ఐ కోన మధుసూదన్‌(33). నల్లగొండలో నిర్వహిస్తున్న పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల విధులు నిర్వహించేందుకు భూదాన్‌పోచంపల్లి నుంచి స్వయంగా పోలీస్‌ సుమో వాహనం నడుపుతూ ఇంటి నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరాడు. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదకరమైన కల్వర్టు రోడ్డుకు సమాంతరంగా ఉండడంతో పోలీస్‌ వాహనం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి కంప చెట్లలోకి పల్టీకొట్టింది.

వెంటనే బెటాలియన్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్‌ను రప్పించేలోపే అటు వైపుగా వెళ్తున్న 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 5.30 గంటలకు తరలించారు. గంటకు పైగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌ఐ మధుసూదన్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు.