అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌ రాష్ట్రం, హుర్లా గ్రామానికి చెందిన సురేష్‌చంద్‌ జాన్‌గిద్‌ కుమార్తె నిర్మల కుమారి అలియాస్‌ మంజు(29)కు భాగ్యలక్ష్మి కాలనీ శ్రీకృష్ణనగర్‌కు చెందిన సంతోష్‌కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం అత్తింటి వారు మంజును వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న మంజు తన అక్క మల్లికకు ఫోన్‌ చేసి తన భర్త, అత్తింటి వారు రూ. 5 లక్షలు తేవాలని ఒత్తిడి చేస్తురని, తాను జైపూర్‌ వచ్చేస్తున్నట్లు తెలిపింది.

అయితే ఈ నెల 19న మంజు విషం తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె అత్తింటివారు మృతురాలి తండ్రి సురేష్‌ చంద్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. గురువారం నగరానికి వచ్చిన ఆయన అత్తింటి వారి వేధింపుల కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.