పెళ్లి.. పెళ్లి.. పెళ్లి.. ఇది తప్ప జీవితంలో ఇంకేమీ ఉండదా.. చదువు ముగియగానే ఉద్యోగం.. అది దొరకగానే పెళ్లి.. తర్వాత పిల్లలు.. ఇదేనా జీవితం.. ఏదైనా సాధించాలి లేదా కొన్నేళ్లు ఆనందంగా గడపాలి..’ పెళ్లి గురించి యువతను కదిపితే వచ్చే సమాధానాలివి. కెరీర్‌లో ఆస్వాదించాలనుకున్న వాటికి పెళ్లి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తుందని ఎక్కువమంది యువకులు భావిస్తున్నారు. పెళ్లి విషయంలో హైదరాబాద్‌ సహా దేశంలోని పలు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతీ, యువకుల ఆలోచనలపై నీల్సన్‌ సంస్థ అధ్యయనం చేసింది. యువత ఆదాయంతో పాటు ఖర్చులు, పొదుపు తదితర విషయాల పైనా సర్వే జరిపి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విందులు, విలాసాలకే ఎక్కువ మంది యువకులు తమ డబ్బును ఖర్చు చేస్తున్నారని తెలిపింది.

వివాహం ఎందుకు..? 

28-30 ఏళ్ల వయస్సు వారి జీవనశైలిని గమనిస్తే… వీరు పెళ్లికి చాలా దూరంగా ఉంటూ కెరీర్‌ను ఉన్నత మార్గంలో మలచుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. 30 ఏళ్ల పైబడిన వారిని గమనిస్తే ఎక్కువ మొత్తంలో సంపాదించడానికే తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. వారంలో 20 గంటలు వినోదానికి, స్మార్ట్‌ ఫోన్‌, సామాజిక మాధ్యమాల్లో గడపడంలో బిజీగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. స్త్రీ, పురుష తేడా లేకుండా అందరూ విపరీతంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌, వినోదాలకు విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారు.

ఖర్చుకు వెనకాడటం లేదు.. 

దేశంలోని పలు ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో నీల్సన్‌ అధ్యయనం చేసింది. అత్యధిక వేతనాలు పొందుతున్న యువతీ, యువకుల్లో చాలామంది పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది. అందులోనూ నెలవారీ జీతంలో ఎక్కువ వృథా ఖర్చులు చేస్తూ పొదుపునకు చాలా దూరంగా ఉంటున్నారని పేర్కొంది. పట్టణాల్లో నివాసం ఉంటూ.. 28 నుంచి 45 ఏళ్ల వరకు ఒంటరి జీవితానికి అలవాటు పడిన యువకులపై సర్వే చేయగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వీరితోపాటు విడాకులు తీసుకున్నవారు, పెళ్లి బంధాన్ని కాదనుకుని విడిగా ఉంటున్నవారు, సింగిల్‌ పేరెంట్‌, పెళ్లి వద్దనుకుంటున్న వారి మనోగతాలపై పరిశీలన చేయగా ఎక్కువ మంది జీవితాన్ని సంతోషంగా గడపడం కోసం ఖర్చుకు వెనకాడటం లేదని తెలిపింది. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఈ ధోరణి కాస్త తక్కువే.