ప్రేమించి, పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన వీరిద్దరూ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అప్పటినుంచి వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట విష్ణుకాంత్‌ సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని, తనకు గతంలో ఒక లవ్‌ స్టోరీ ఉందన్న విషయాన్ని కూడా చెప్పలేదంటూ ఆమెకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ లీక్‌ చేశాడు. అది నెట్టింట వైరల్‌ అవడంతో పలువురూ సంయుక్తను తిట్టిపోశారు. ఈ క్రమంలో తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపించింది నటి. శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అడల్ట్‌ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడంది.

బెడ్‌రూమ్‌లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అలర్జీ వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్తానంటే అంగీకరించలేదని, అప్పుడు ఎంతో బాధేసిందని ఆవేదన వ్యక్తం చేసింది సంయుక్త. అయితే సంయుక్త ఆరోపణలను విష్ణుకాంత్‌ తిప్పికొట్టాడు. ‘ఆమె ఇప్పటికీ తన తప్పు ఒప్పుకోవడం లేదు. తనను తాను రక్షించుకోవడానికి నా మీద నిందలు మోపుతోంది. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలిగా. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్‌ పెట్టానంటోంది. మరి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుందిగా సంయుక్త చెపుతోందంతా అబద్ధం. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఆమె ఇదంతా చేస్తోంది. సాక్ష్యాధారాలు లేకుండా ఆమె చెప్పే మాటలను ఎవరూ నమ్మకండి’ అని కోరాడు.