పెళ్లైన రెండు రోజులకే ఓ కొత్త జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించబోరనే భయంతో ఓ హోటల్ గదిలో విషం తాగి చనిపోయారు. భువనగిరి పట్టణంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన అలకుంట స్వామి (23), ఉమా రాణి (19) కొంతకాలంగా ప్రేమించుకున్నారు.

ఇద్దరు సమీప బంధువులే అయినప్పటికీ వారి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దాంతో స్వామి, ఉమారాణి ఇంటి నుంచి వెళ్లిపోయి ఫిబ్రవరి 16న యాదాద్రి క్షేత్రంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారిద్దరు మేజర్లే కావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పోలీసులు నచ్చజెప్పారు.

ఐతే తమ పెళ్లిని పేరెంట్స్ ఒప్పుకోరనే ఆందోళనతో ఇరువురూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం భువనగిరి పట్టణంలో ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. సోమవారం రాత్రి అక్కడే ఉన్నారు. మంగళవారం ఉదయం సిబ్బంది వచ్చి చూసేసరికి దంపతులిద్దరు రూమ్‌లో అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అప్పటికే స్వామి చనిపోయాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఉమారాణిని హైదరాబాద్‌కు తరలించగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్వామి, ఉమారాణి మృతితో ఇరువురి కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి