ఉద్యోగం ఇచ్చేటపుడు ఏమి అనుభవం ఉందని అడిగేవారు, పెళ్లిచూపుల్లో అబ్బాయికి ఏమి అనుభవం ఉందని ఎందుకు అడగరు? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు గురువారం కర్ణాటక విధాన పరిషత్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.

ఈ వ్యాఖ్యలు మహిళలకు అవమానకరమని బీజేపీ ఎమ్మెల్సీ తేజస్వినిగౌడ వాకౌట్‌ చేయగా, ఇతర సభ్యులు ఆయనపై మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై చర్చ ఆరంభించిన ఇబ్రహీం ఈ మాటలనగానే తేజస్విని గౌడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాషాయ సభ్యులు నారాయణస్వామి, రవికుమార్, అరుణ్‌ శహాపుర, సుబ్రమణి తదితర సభ్యులు లేచి నిలబడి ఆమెకు మద్దతు పలికారు.

ఇబ్రహీం ఆడ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పిల్లాడికి అనుభవాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. ఈ దశలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఇబ్రహీం పట్టించుకోకుండా చర్చను కొనసాగిస్తుండగా తేజస్వినిగౌడ సభ నుంచి వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులంతా ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది.