పెళ్లి బాజాభజంత్రీల మోత ఆగిందో లేదో.. ఆ ఇంట చావుడప్పు ఆరంభమైంది. పెళ్లియిన మరునాడే గుండెపోటు రూపంలో మృత్యువు కొత్త పెళ్లికొడుకును తన ఒడిలోకి చేర్చుకుని పెళ్లివారింట విషాదం నింపింది. వివరాలిలా.. మదనపల్లె పట్టణంలోని ఎన్‌వీఆర్‌ వీధికి చెందిన మగ్బూల్‌ కుమారుడు మోహీన్‌బాషా (28) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇతనికి మదనపల్లెకే చెందిన ఓ యువతితో ఆదివారం రాత్రి వివాహం జరిగింది.

రాత్రి 12 గంటల వరకు అందరూ బంధువులతో కలసి సంతోషంగా గడిపారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మోహీన్‌బాషాకు ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు అతనిని మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు.

అయితే అప్పటికే మోహీన్‌బాషా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లికొడుకు మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, నవవధువును ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు.