మదనపల్లి నియోజకవర్గంలోని రామ సముంద్రం మండలం బాలసముద్రం గ్రామ సమీపంలోని చెరువులో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. భర్తతో సహా అతడి కుటుంబ సభ్యులే చంపేశారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే: అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలోని పెద్ద పంజాని మండలం చీమలపల్లికి చెందిన అమృతకు రామసముద్రం మండలం బాలసముద్రానికి చెందిన గణేష్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇప్పటి వరకు వారికి సంతానం లేదు. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుండేవని సమాచారం. అంతేకాక అమృతాను కట్నం కోసం గణేష్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని అమృత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అలానే పిల్లల పుట్టడం లేదని అమృతను వేధించిన విషయంలో గతంలో పెద్దలు పంచాయితీ కూడా చేశారు. ఆ తరువాత కొంతకాలం పాటు అమృతాతో గణేష్ బాగానే ఉన్నాడు. అయితే మరికొంతకాలనికి గణేష్ మళ్లీ అమృతను కట్నం కోసం వేధించే వాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఈ నెల 15న అమృత కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులకు గణేష్ సమాచారం ఇచ్చాడు. ఆ తరువాతి రోజే రామసముద్రం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బాలసముద్రం గ్రామ సమీపంలోని చెరువులో అమృత శవమై కనిపించింది. దీంతో ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. గణేష్, అతడి కుటుంబ సభ్యులే అమృతను హత్య చేసి చెరువులో పడేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు కుమార్తెకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.