దేశంలోని పేదలందరికీ ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్ అందించేలా ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇంతకుముందుకు దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే ఈ పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్ అందించేవారు. ఇకపై ఈ పథకం కింద అర్హులు కాని, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ లేని పేదలకు కూడా ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్ అందించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దేశంలోని అన్ని పేద కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్ల అందించే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ పథకం కింద పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించిన రిటైలర్లకు ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై కేంద్రం రూ.1,600 రాయితీ అందిస్తున్నది. కుకింగ్ స్టవ్‌ను మాత్రం లబ్ధిదారులే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ భారాన్ని కూడా తగ్గిస్తూ, స్టవ్ ఖర్చు, మొదటి గ్యాస్ ఫిల్లింగ్ ఖర్చును వాయిదా పద్ధతిల్లో చెల్లించే వెసులుబాటును వినియోగదారులకు ప్రభుత్వం కల్పించింది.