కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ విద్యార్థులు , తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు విద్యార్థులు కళాశాల గేట్ వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు . కళాశాలలో సివిల్ , మెకానికల్ ఇంజినీరింగ్ , ఈఈఈ, సీఎస్ఈ, ఐటీ బ్రాంచీలు కొనసాగుతున్నాయి . వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు . 2008 – 2009లో ప్రారంభమైన కాళాశాలలో అరకొర వసతుల మధ్య చదువులు కొనసాగుతున్నాయి . || కాగా విద్యార్థులు తమ సమస్యలను పలు మార్లు యూనివర్సిటీ వీసీ , రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళకు దిగారు . సరిపడా రెగ్యులర్ లెక్చరర్లు , తరగతి గదులు , ల్యాబ్లు లేవని ఇబ్బందులు పడుతున్నామని , వాటిని కేటాయంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు .
మగ్గురు రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా మిగతా వారంతా కాంట్రాక్టు , పార్ట్ టైం , గెస్ట్ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు . దీంతో విద్యాబోధనలో నాణ్యత లోపించిందని ఆరోపించారు . సరిపడా ల్యాబ్లు లేవని . . అరకొరగా ఉన్న వాటితో ప్రాక్టీకల్స్ చేయలేకపోయామని వాపోయారు . కొన్ని బ్రాంచీలకు అసలు ల్యాబ్లే లేవని ఆవేదన వ్యక్తం చేశారు . సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకైతే అసలు ల్యాబ్ సౌకర్యంలేదని గత కొంత కాలంగా నిర్మాణంలోనే ఉందని చెప్పారు . అరకొర హాస్టళ్లలో వసతి పొందాల్సి వస్తోందని సౌకర్యాలు లేవని తెలిపారు . ఒక్కో గదిలో 10 నుంచి 20 మంది వరకు ఉంటున్నారన్నారు . కళాశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు . అక్కడికి చేరుకున్న రిజిస్ట్రార్ పురుషోత్తమ్ , పరీక్షల నియంత్రణ అధికారి మహేందరెడ్డికి విద్యార్థుల సమస్యలను వివరించారు .
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ . . కొన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మిగతా వాటికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు . ఒక్కొటిగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు . అయితే విద్యార్థులు అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు . దీంతో రిజిస్టార్ పురుషోత్తమ్ అక్కడి నుంచి వెనుదిరిగారు . విద్యార్థులు భోజనానికి కూడా హాస్టల్ కు వెళ్లకుండా అలాగే రాత్రి 7గంటల వరకు ఆందోళన కొనసాగించారు . తమ సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు .