పోలీసు లాటీ ఝుళిపించడమే కాదు !!

అవసరమైతే పిల్లలను లాలిస్తారుకూడా !!

నిన్న తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌లో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారితో కలిసి పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుంది.
అయితే పరీక్ష హాల్‌లోకి అభ్యర్థిని తప్ప ఎవరిని అనుమతించరు. దాంతో ఎగ్జామ్‌ రాసి వచ్చేంతవరకూ తన చిన్నారిని చూసుకోవడం కోసం తన బంధువుల అమ్మాయిని వెంట తీసుకొచ్చింది. పరీక్ష ప్రారంభం కావడంతో సదరు మహిళ తన చిన్నారిని వెంట వచ్చిన మనిషి దగ్గర వదిలి లోపలికి వెళ్లింది. కానీ తల్లి అలా వెళ్లిన క్షణం నుంచి ఆ పాపా గుక్క పట్టి ఏడవడం ప్రారంభించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడుపు ఆపడం లేదు.

ఈ క్రమంలో పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని సమూదాయించడానికి ప్రయత్నించాడు. తాను పోలీస్‌ ఉద్యోగిననే గర్వం ఏమాత్రం లేకుండా చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’కు అసలైన ఉదాహరణగా నిలిచారు. చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ఫోటోను రేమా రాజేశ్వరి అనే ఐపీఎస్‌ అధికారి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. దాంతో పాటు “Human Face Of Cops “ అనే హాష్‌ ట్యాగ్‌ను జత చేశారు.